సాయమకాలమయ్యింది – గొల్లపూడి మారుతి రావు
by Vijay Kiran
సాయమకాలమయ్యింది – గొల్లపూడి మారుతి రావు నుంచి మచ్చుకి కొన్ని పేరాలు
భరించరాని దుఃఖం మనిషిని ఆవరించినప్పుడు రెండు జరుగుతాయి. వేదనగల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. నిర్మలమయిన అంతఃకరణ గల వ్యక్తి ఊహించని మలుపులో ఏకోన్ముఖుడవుతాడు. అంటే, దిక్కుతోచని దశలో బలమైన దిక్కువైపు మనస్సుని మళ్ళించుకుంటాడు. అది అతని కర్మపరిపాకం. సంస్కారం. అంతకన్నా కారణం మరొకటి వుండదు. అంతులేని దుఃఖంలో తాగుబోతులయినవారూ ఉన్నారు. అద్భుతమైన కావ్యాన్ని సృష్టించినవారూ ఉన్నారు. రెంటికీ ప్రాతిపదిక వేదనే.
తన కడుపున పుట్టింది సాక్షాత్తూ విష్ణుమూర్త్తేనన్న స్పృహ తనకి ఉండరాదని కోరుకున్నాడు దశరధుడు ముందుజన్మలో. కేవలం తండ్రికి పుత్రునిమీద ఉన్న మమకారాన్ని పూర్తిగా అనుభవించాలన్నదే ఆయన లక్ష్యం. కానీ తనకు పుట్టింది భగవంతుడేనన్న జ్ఞానాన్ని కోరుకుంది కౌసల్య. అంతటి అదృష్టాన్ని మరిచిపోతే ఎలా? ఆ దివ్యానుభూతిని కోల్పోతే ఆ వరానికి విలువేముంది? అదీ ఆవిడ ఉద్దేశ్యం.
అమెరికానుంచి వచ్చే కుటుంబాల కథ – అదొక పెద్ద ప్రహసనం. ఇలాంటి ప్రయాణాలకే ప్రత్యేకించిన పెట్టెలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క పెట్టెలో ఆరేళ్ళ వయస్సుగల పిల్లలు కాలు మడత పెట్టుకోకుండా ముగ్గురు పడుకోవచ్చును. అంత విశాలంగా, అంత భారీగా ఉంటాయి. వాటిలో ఏం ఉంటాయి? అమెరికా వెర్రిని ఇండియాలో పంచటానికి కావలసినంత సామగ్రి ఉంటుంది. వాకీటాకీలు, కీచైన్లు, రీబోక్ షూలు, రంగురంగుల టైలు, ‘కిక్ మీ ఎగైన్’, ‘ఓహో నాట్ నౌ’, ‘దట్సిట్’ లాంటి రకరకాల నినాదాల బనీన్లు, సగం చిరుగులుపడ్డ జీన్ పాంటులు, చూయింగ్ గమ్ లు , ఆమెరికాల సినిమాల కేసెట్లూ, కంప్యూటర్ ఫ్లాపీలు, కెమెరా రీల్సూ, చిన్నసైజు విస్కీ సీసాలు, మార్ల్ బరో సిగరెట్టు పాకెట్లూ … మీ ఇష్టం.
వెళ్ళేటప్పుడు ఈ సూట్ కేసులనిండా ఏముంటాయి? కరక్కాయలు, తీనేసీసాలు, మొలతాళ్ళు, ఊరగయడబ్బాలు, షిర్దీ సాయిబాబా విబూదీ, పసుపు పొట్లాలు, మిరియాలు, లవంగాల పాకెట్లు, కంచిపట్టు చీరలు, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామాలు, ఇటీవల తెలుగు సినిమాల వీడియోలు, ఘంటసాల పాత పాటలు, పవిత్రమైన గంగాజలం … మీ ఇష్టం.
ఆ ఇరవై రోజుల్లో అమెరికా పైత్యాన్నంతా ఈ దేశానికి దిగుమతి చేసి, మరో మూడేళ్ళపాటు ఇండియా సంప్రదాయ సంపదని మూటగట్టుకు పట్టుకుపోతారు.
